కథా కమామీషు ఒక చక్కని ఆహ్లాదకరమైన సినిమా
నాలుగు పెళ్ళైన జంటల అపోహలు, అపార్ధాలుతో నడిచే కథ. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం అన్నట్టుగా వారి సమస్యలు, అపోహలు చివరికి ఎవరి ప్రమేయం లేకుండానే దూది పింజల్లా తేలిపోతాయి.
గంటా ఏభై నిమిషాల ఈ సినిమాలో ఇంద్రజ పెర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. ఒక సింగిల్ పేరెంట్ గా ఉంటూ, పోలీసు ఆఫీసర్ గా విధుల్లో కటువుగా వుంటూనే, ఒక తోడు వెతుక్కుని అతనితో సంతోషంగా వుండాలనే ఆకాంక్ష వున్న ఒక ప్రౌఢగా ఆమె నటనలో మంచి పరిణితి కనబడుతుంది. ఆమె జంటగా కరుణ కుమార్ ను ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు. అతని నటన కూడా అంతంత మాత్రమే. మిగిలిన జంటలు చక్కగా కుదిరారు.
యాంకరింగ్ లోనే కాదు సినిమాల్లో కూడా చూడముచ్చటగా వున్న అమ్మాయి హర్షిణి. ఈ సినిమాలో సహజంగా, మనకి బాగా తెలిసిన అమ్మాయిలా వుంటుంది.
ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక నిశ్చలమైన నదిలా సాగిపోతుంది ఈ సినిమా. నాలుగు జంటల నాలుగు వేర్వేరు కథలైనా ఎక్కడో ఓ చోట ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళే అయివుంటారు. కానీ ఎవరి కథలు వారివే.
ఇంత చక్కని సినిమా తీసిన దర్శకద్వయం గౌతమ్ కార్తీక్ లు అభినందనీయులు.