గాలివాన
నాకు బాగా గుర్తు. ఆ రోజు సాయంత్రం విపరీతమైన గాలి, వాన. మేమున్న పూరిల్లు పడిపోతుoదేమోనన్న భయంతో మా అమ్మ , చెల్లి దగ్గర్లో ఉన్న మా డాబా తాత వాళ్ళింటికి వెళ్లారు. నన్ను మా నాన్న గట్టిగా పట్టుకుని డాబా ఇంటికి తీసుకెళుతున్నాడు. పట్టుకోకపోతే 9 ఏళ్ల పిలగాడు గాలికి దూదిపింజలా ఎగిరిపోయేవాడే! మొత్తానికి డాబాలో జేరాము. బయట ఉరుములు, మెరుపులు, డాబా కూడా పడిపోయిద్దేమో అన్నట్టు భయoకరమైన హోరు. బిక్కు బిక్కుమంటూ అక్కడవున్న వడ్ల బస్తాలమీద పడి నిద్ర పోయా.
తెల్లారికి అంతా నిశబ్దంగా ఉంది. బయటకొచ్చి చూస్తే చావిళ్ల మీద వున్న కప్పులు లేచిపోయి, బర్రెగొడ్లు కట్లు తెంచుకుని తిరుగుతున్నాయి. చెత్త వాములు సగమే ఉన్నాయి. చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడి ఉన్నాయి. జనాలు పడిపోయిన ఇళ్ళకాడ సామాన్లు సర్దుకుంటున్నారు. మా ఇల్లు పడిపోయింది. దూలం విరిగి నవ్వారుమంచం మీద పడి మంచం విరిగిపోయింది. గోడ కూడా పడిపోయింది.
ఆ రోజో, తరవాతో హెలికాఫ్టర్లో అప్పటి ప్రధాని ఇందిరమ్మ ఆ ప్రకృతి విలయాన్ని చుట్టానికి మనవూరి మీదుగా వెళ్ళింది.
నష్టపోయిన చాలా మందికి బియ్యం, గోధుమలు, డబ్బులు 250 అనుకుంటా ఇచ్చారు. ఆ డబ్బుల పంపకాన్ని పిచ్చిమంత్రి అనే ఒకాయన (పేరు గుర్తులేదు) పర్యవేక్షించారు. ఆ డబ్బులు తీసుకుని మా ఇంటి పక్కనే ఉన్న గుడ్డెంకయ్య తాత సారా కొట్టుకాడినుంచి డబ్బులు అయిపోయేదాకా ఇంటికి రాలేదు. తాగి తాగి ఆ తర్వాత వారం రోజులకి పైకి పోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి