మన వూరి సినిమా హాలు
నేను పుట్టక ముందో లేక నాకు ఊహ తెలిసేప్పటికే మనూళ్లో సినిమా హాలు వుంది. దాని పేరు శ్రీ లక్ష్మి టూరింగ్ టాకీస్. రెండు పక్కలా సినిమా పోస్టర్స్ అంటించిన ఒక గూడురిక్షా (సినిమా బండి)లో ఒకాయన రిక్షా తొక్కుతుంటే, ఇంకో ఆయన లోపల కూర్చుని రికార్డు ప్లేయర్లో సినిమా పాటలు ప్లే చేస్తూ వూరంతా తిరుగుతూ మధ్య మధ్యలో టాకీసులో ఆడుతున్న సినిమా గురించి ప్రచారం చేస్తుండేవారు. వీటికి తోడు పాంప్లెట్స్ కూడా పంచేవారు. వాటిని సినిమా కాయితాలు అనేవాళ్ళం. అవి రంగు రంగులుగా A4 సైజ్ పేపర్లో నాల్గవ వంతు వుండి ఆయా సినిమాల్లోని హీరో హీరోయిన్, కామెడీ నటుల నలుపు తెలుపు ఫోటోలతో పాటు ఆ సినిమా గురించి కొద్దిగా కథ ప్రచురించి మరి సరోజ గోపిల ప్రేమ ఫలించిందా? రాజనాల ఆట కట్టించారా?? తెలుసుకోవాలంటే ఈ రోజే వెండి తెరపై చూడండి అని వుండేది. ఆ పేపర్లను రిక్షాలోంచి విసురుతుంటే పిల్లలందరం ఆ రిక్షా వెనకే పరిగెత్తుతూ వాళ్ళు విసిరే పేపర్లని చేజిక్కించకోవడానికి పోటీ పడేవాళ్ళం. ఇక ఆయన మైకులో ఇలా చెప్పేవాడు. "నేడే చూడండి, మీ అభిమాన సినిమా థియేటర్ శ్రీ లక్ష్మి టూరింగ్ టాకీస్ లో నటశేఖర కృష్ణ, అందాల తార జయప్రద నటించిన వూరికి మొనగాడు సినిమా" అంటూ ఇంకా చాలా చెప్పేవాడు. ఆ సినిమాలో పాటలు మోగించేవాడు.
ఈ టాకీస్ పెద్దకాలువ ఒడ్డున వుండేది (ఇప్పటి వంతెన పక్కన, అప్పటికి వంతెన లేదు. బల్లకట్టుపై కాలువ దాటే వాళ్ళు). రోజుకు ఒక ఆట మాత్రమే. ఎప్పుడైనా రెండు ఆటలు ఆడించే వాళ్ళు. ముఖ్యంగా రాత్రుళ్ళు మాత్రమే సినిమాలు ఆడేవి. నాకు తెలిసినప్పుడు అంటే 78-80ల్లో టిక్కెట్ రేటు నేల 45 పైసలు, బెంచి 60 పైసలు, కుర్చీ రూపాయి వుండేది. సినిమా తొమ్మిది కి మొదలైతే ఎనిమిది నుంచి పాటలు పెట్టే వాళ్ళు. మొదట సీతారాముల కళ్యాణం చూతము రారండి తో మొదలై ఆ తర్వాత వరసగా మరోచరిత్ర సినిమాలోని ఏ తీగపువ్వునో, భలే భలే మగాడివోయ్, పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకి కోటి దండాలు మొదలైన పాటలతో మోత మోగించేవాళ్ళు.
ఇక చివరి పాట అంటే ఆఖరి రికార్డు హే కృష్ణా ముకుందా మురారీ పాట వదిలేవాళ్ళు. ఇక చూడు జనాలు యహే ఆకర్రికార్డు కూడా ఏసారు పదండి పదండి అని తొందర పెట్టేవాళ్ళు. ప్రొజెక్టర్ రూం కన్నం లోంచి హాలు నిండిందా లేదా చూసి జనాలు మరీ పలచగా వుంటే ఆఖరి రికార్డు మళ్లీ తగిలించేవాడు.
వేటగాడు సినిమా చాలా బాగుందిరా నిన్న చూసా అంటూ బళ్ళోకొచ్చిన దగ్గర నుండీ ఆ సినిమా డైలాగ్ టూ డైలాగులతో వూదరగొడుతున్న శీనుగాడి దెబ్బకి మనకి సినిమా చూడాలన్న తెగులు పుట్టింది. అంతే బడి అవగానే ఇంటికొచ్చి యుద్ధం మొదలెట్టాను. చాలా సేపు సాగిన ఆ సంగ్రామంలో విజయమూ దాంతో పాటు అర్ధ రూపాయి సాధించి, అప్పటిదాకా అలిగి తినకుండా పళ్ళెంలోనే ఉన్న అన్నాన్ని రెండు నిమిషాల్లో తినేసి, సినిమా హాలు మైకులో నుండి వినబడుతున్న భలే భలే మగాడివోయ్ పాటని హమ్ చేసుకుంటూ వేగంగా హలు వైపుకి పరుగు తీసాను.
కాలవ వొడ్డున ఉన్న సినిమా హాలు లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సినిమా పోస్టర్స్ లో వున్న నటీనటులు మా ఇంటికి రా అని ఆహ్వానం పలుకుతున్నట్టుగా వున్నారు. గబుక్కున జేబులోంచి అర్ధ రూపాయి బిళ్ళ తీసి కౌంటర్ లో ఇచ్చి టికెట్టు మిగిలిన ఐదు పైసల చిల్లర జాగ్రత్తగా జేబులో పెట్టుకొని, మళ్లీ ఒకసారి పోస్టర్స్ తనివితీరా చూసుకుని కాలువ వొడ్డుకొచ్చి నిలబడ్డాను. సెలవు రోజుల్లో కాల్వ రేవులో గేదెల తోకలు పట్టుకుని నేర్చుకున్న ఈత నుండి బల్లకట్టెక్కి కాలువ మధ్యలోకి దూకే వరకూ ఈత వచ్చిన నాకు ఈ వెన్నెల రాత్రి ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలువ ఏమిరా ఇప్పుడొచ్చావు? సినిమాకొచ్చావాని పలకరించినట్టనిపించింది. పగలంతా అలుపు సొలుపు లేకుండా వూరి జనాలని ఆ దరికి ఈ దరికి చేర్చిన బల్లకట్టు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుంది.
సినిమా హాలు గేటులో టికెట్టు ఇచ్చి లోపలకి వచ్చి నేల మీద (ఇసుకలో) చతికిలబడి ఒకసారి చుట్టూ చూసాను. సినిమా వచ్చి వారమైనా జనాలు గొలగోలగా బానే వచ్చారు. సినిమా మొదలవ్వుతుందన్నట్టుగా వీనుల విందుగా గణగణమని బెల్లు మోగింది. తెల్లటి తెరమీద నిశ్శబ్దం అని ఒక బుడ్డోడు నోటిమీద వేలేసుకున్న ఒక స్లైడు పడింది. ఆ తర్వాత ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు అనే స్లైడ్. NFDC వాళ్ల ఐదు నిమిషాల డాక్యుమెంటరీ (ట్రైల్ పార్టీ అనేవాళ్లం) తర్వాత అసలు సినిమా మొదలైంది.
చిన్నప్పుడు నాకు సినిమాల్లో పాటలంటే చిరాకు. ఫైట్లు, కామెడీ సీనులంటే ఇష్టం. తెరమీద బల్లులు కూడా నటులతో పోటీ పడేవి. తెరమీద బొమ్మ ఆగిపోయి ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. విశ్రాంతి (ఇంటర్వల్) అనుకునేరు, కాదు మన టాకీసులో ఒకే ప్రొజెక్టర్ వుంది. సో.. రీలు మార్చి మళ్లీ మొదలు పెట్టాలి. మొత్తం నాలుగు పార్టులుగా సినిమా చూడాలి. మధ్యలో కరెంటు పోతే పార్టులు ఇంకా ఎక్కువవుతాయి. కాసేపటికి విశ్రాంతి.
లైట్లు గుప్పుమని వెలిగాయి. ఆ.. సోడా సోడాయే అనుకుంటా షోడా కేసు పట్టుకుని నేల, బెంచి, కుర్చీల సెక్షన్లకి అమ్మేవాళ్లు తిరుగుతున్నారు. పది పైసలు తీసుకుని షోడా సీసా మీద tube ముక్క పెట్టీ ఓపెనర్ తో నొక్కి కిచుక్కుమనే అదో సౌండు తో ఓపెన్ చేసి ఇచ్చేవాడు. మనకి షోడా తాగే సీన్ లేదు. జేబులో ఉన్న ఐదు పైసలుతో బయటకి వెళ్ళి జీడీనో, పప్పుండో కొనుక్కుని బుగ్గనేసుకుని వచ్చేవాడిని. విశ్రాంతి తర్వాత సినిమా మొదలయ్యే ముందు రాబోవు చిత్రాలు అని కొన్ని సినిమాల స్లైడ్స్ వేసేవారు. నేల ముందే తెర ఉండటం వల్ల మెడ నొప్పి పుట్టేది. మెల్లగా అటూ ఇటూ చూసి గేటుకాడ ఎవరూ లేకుండా చూసి నేలకి బెంచికి మధ్యనున్న కర్రలతో కట్టిన బ్యారికెడ్ దూకి బెంచిలో సెటిల్ అయ్యేవాళ్లం.
సినిమా అయిపోయాక అరే అప్పుడే అయిపోయిందా అనుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి ఒకే టికెట్టు మీద రెండు ఆటలు వేసేవాళ్లు. రెండు సినిమాలు అయిపోయేవరకు తెల్లారి 3 గంటలయ్యేది.
ఈ హాల్లో చివరి సినిమా కొండవీటి సింహం. రేపే ఆఖరాట అని ప్రతీ రోజూ చెప్పి నెల పైగా ఆడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి