9, నవంబర్ 2014, ఆదివారం

వెంకట రెడ్డి ఆఖరి ఘట్టం 

అక్టోబర్ 31, 2014 మద్యాహ్నం కాలేజీ కి వెళ్దామని లంచ్ చేస్తున్నాను . ఫోన్ వచ్చింది శ్రీను గుంటూరు నుండి.
సర్లే ! తరువాత మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. కాసేపటికే మరో ఫోన్ అంజి రెడ్డి నుండి. ఏమై  వుంటుందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశా ! " వేణు! హాస్పిటల్ కు వెళ్ళావా ! " అని ఇంకా చెప్పబోతుంటే మనసు కీడు శంకించింది. వెంకట రెడ్డి కి ఏమైంది ? అన్నా వణుకుతున్న గొంతుతో.
"నీకు తెలియదా ? సుబ్బారెడ్డి లక్ష్మి పురం తీసుకు వద్దామనుకున్తున్నాడు. అక్కడ వాళ్ళేమనుకున్తున్నారో " అన్నాడు
నాకు పూర్తిగా అర్థం అయ్యింది. వెంకట రెడ్డి ఇక లేడని. భోజనం చెయ్య బుద్ది కాలేదు. శిల్ప తో విషయం చెప్పను. అయ్యో ! అంది.
శ్రీనుకు ఫోన్ చేసాను. "రాజేంద్ర ఫోన్ చేసి చెప్పాడు . అది చెబుదామనే నీకు ఫోన్ చేసాను" అన్నాడు
ఏదో తిన్నాననిపించి వెంటనే నిమ్స్ హాస్పిటల్ కు బయలు దేరాను.

ప్రవీణ్ కు ఫోన్ చేసి ఏ వార్డో  కనుక్కుని అక్కడకు చేరుకున్నాను. అక్కడ విష్ణు, శోభన్, ప్రవీణ్, వెంకట రెడ్డి భార్య బయట కుర్చుని వున్నారు. ప్రవీణ్, విష్ణు తో లోపలకి వెళ్ళాను.

హాస్పిటల్ బెడ్ మీద ప్రాణం లేని వెంకట రెడ్డి పడి వున్నాడు. ఆక్సిజెన్ ట్యూబ్ నోట్లేనే వుంది. శ్వాస ఆడుతున్నట్టు పొట్ట పైకి కిందికి కదులుతుంది - బ్రతికే వున్నాడా అన్నట్టు. వెంకట రెడ్డి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను, చల్లగా వుంది. ముఖం నిర్మలం గా కొంచెం ఉబ్బి  వుంది. తలకు రంగు వేసాడనుకుంటా ! గడ్డం నున్నగా షేవ్ చేసి వున్నాడు.
కాసేపటి తరువాత బయటకి వచ్చాం. కృష్ణ (వెంకటరెడ్డి భార్య) 2014 మొత్తం హాస్పిటల్ లోనే సరిపోయింది. కొత్త ఇల్లు కొన్నా, ఇంట్లో వుంది చాల తక్కువ అని బాధ పడింది. పాపం ఆ మాట నిజమే ! వెంకటరెడ్డి కూడా తన బాధల నుండి విముక్తి చెందాడు. కిడ్నీలు రెండూ  ఫెయిల్ అయ్యి నరక యాతన అనుభవించాడు. మరీ ఈ సంవత్సరమే !

ఇంతలో శేషి రెడ్డి వచ్చాడు. మరల ఇద్దరం వెళ్లి వెంకట రెడ్డి ని చూసి వచ్చాం. లోపల ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇంతలో నవీన్ (వెంకట రెడ్డి చిన్న కొడుకు ) కెనడా నుండి ఫోన్ చేసాడు. తను వచ్చే వరకు సోమవారం అవుతుంది అన్నాడు. తరువాత రాలేనన్నాడు.

అంబులన్స్ మాట్లాడి బాడీని లక్ష్మీ పురం పంపించాము. ఆ తెల్లారి శనివారం (4. 30) నేను, శేషి రెడ్డి, విష్ణు, నవీన్ (శేషిరెడ్డి కొడుకు) నలుగురం విష్ణు కారులో బయలు దేరి లక్ష్మీ పురం 8 గంటలకల్లా చేరాము.

వెంకట రెడ్డి బాడీ ని స్నానం చేయించి  పాడే మీదకెక్కించారు. దండలు, పూలు వేసారు.  గుంటూరు నుండి శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో వచ్చారు. మోహన్ ముందు రోజే వచ్చాడు. కొబ్బరి కాయలు కొట్టారు. నేను కుడా పూలు వేసి కొబ్బరి కాయ కొట్టాను. శేషి రెడ్డి, నవీను, సాంబి రెడ్డి ఇంకా అవుతు వాళ్ళు పాడే నెత్తుకున్నారు.
ఊరికి ఉత్తరాన కాలువ వడ్డున దహన సంస్కారాలు జరిపించారు.

ఇక పెద్ద కర్మ నెక్స్ట్ డే ఆదివారమే చేద్దామనుకున్నారు. తరువాత కెనడా నుండి నవీన్ వస్తాడని చెప్పారు, అందుకని 11 వ రోజు పెద్ద కర్మ జరుపుదామనుకున్నారు. అంటే 10 వ తారీఖు.

నేను  శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కి వచ్చి జన్మభూమి ఎక్ష్ప్రెస్స్ లో హైదరాబాద్ వచ్చాను. ఇంటికి వచ్చే వరకు దగ్గర దగ్గర 10 గంటలయింది.




16, జులై 2010, శుక్రవారం

నా ముచ్చట్లు

బహుశాఅప్పుడు నాకు మూడేళ్ళు ఉంటాయేమో!! సరిగా గుర్తు లేదు। కాని ఒక సంఘటన కొంచెం జ్ఞాపకం ఉంది. నేను అందరితో " నేను మా అమ్మ నాన్న ల పెళ్లి చూసాను " అని చెప్తున్నాను. అందరు ఒకటే నవ్వుతున్నారు. వాళ్ళు నామాటలు మా నాయనమ్మకు చెబితే ఆవిడా నవ్వింది. మా అమ్మ కు ఎవరో ఈ విషయం చెబితే అమ్మ కూడా నవ్వింది. అత్తలు కూడా పెద్దగా నవ్వారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో మన చిట్టి బుర్ర కు అర్థం కాలే. అసలు విషయం మనకు పదేళ్ళు వచ్చినప్పుడు గాని అవగతం కాలేదు. నాకు బాగా ఉహ తెలిసిన తరవాత ఈ విషయాన్ని మాటల సందర్భం లో మా అమ్మ ఎవరితోనో చెబుతూ "మా వాడు మా పెళ్లి చూశానని చేప్పేవాడు. మా మరిది పెళ్ళప్పుడు సత్యనారాయణ వ్రతం నోచుకునేటప్పుడు మమ్ముల్ని కూడా పీటల మీద చూసి మేము కూడా పెళ్లి చేసుకుంటున్నామనుకుని మా వాడు అలా అందరికి చెప్పేవాడు." అంది. అలాగే నేను చిన్నప్పుడు మా అమ్మను తినటానికి ఏదైనా పెట్టు అని తెగ విసిగించే వాడిని. ఓ రోజు ఇలాగే విసిగిస్తుంటే మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు.

23, మే 2010, ఆదివారం

స్నేహితుడి ఇంటికి

ఈ రోజు రీతు మరియు నేను నా చిన్నప్పటి స్నేహితుడు వెంకట రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. రీతు చాల సిగ్గరి. కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఈ రోజు కూడా వెంకట రెడ్డి వాళ్ళ ఇంట్లో ఇదే తంతు. వెంకట రెడ్డి వాళ్ళు ఖైరతాబాద్ లో ఉంటున్నాడు. ఆయన , ఆయన భార్య, ఇద్దరు పిల్లలు (ప్రవీణ్, నవీన్) ఉంటున్నారు. ప్రవీణ్ తాజ్ కృష్ణ లో పని చేస్తున్నాడు. చిన్నోడు ఇంజనీరింగ్ పూర్తి చేసాడు వెంకట రెడ్డి కి రెండు కిడ్నీలు చెడిపోయాయి. డయాలసిస్ మీద బండి లాగిస్తున్నాడు. పెద్దకొడుకు (ప్రవీణ్) హోటల్ లో పని చేస్తున్నాడు కాబట్టి అతనికి ఈ యస్ ఐ సౌకర్యం ఉంది. దాని ద్వారా ట్రీట్మెంట్ ఫ్రీ గా జరుగుతుంది. సరే మనవాడు(రితేష్) వాళ్ళు ఏమి అడిగినా మాట్లాడడు.

18, మే 2010, మంగళవారం

హాస్యం - సరదా

మనకు విపరీతమైన ఆకలి ఎప్పుడు వేస్తుంది?
హోటల్ కి వెళ్లి ఆర్డర్ చేసిన తర్వాత , ఆ ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చే వరకు ఎదురు చూసే సమయం లో.

8, మే 2010, శనివారం

శిల్ప గారి ముచ్చట

నిన్న బ్లాగు రాయటం కుదరలేదు సరే ఇప్పుడు రాద్దాం. శిల్ప వాళ్ళ తమ్ముడి (శ్రీరాం) కూతురి మొదటి పుట్టిన రోజు అని నూతక్కి వెళ్ళింది. శిల్పకు వాళ్ళ ఊరి సౌందర్యం తన స్నేహితురాలు రమకు చూపెట్టాలని ఎప్పటి నుండో ఒక కోరిక. ఎలాగు మేనకోడలి పుట్టిన రోజుకు వెళ్ళుతుంది గదా పనిలోపనిగా రమనుకూడాతీసుకు వెళ్ళితే పుట్టినరోజు కు వెళ్లినట్టు ఉంటుంది వాళ్ళ ఊరు (నూతక్కి) ఎలా ఉంటుందో చూపించ వచ్చు. రమా (అమరనాథ రెడ్డి గారి భార్యామణి ) వాళ్ళ ఊరు కడప జిల్లాలోఒక చిన్న ఊరు వాళ్ళ ఊరు అంత గా అభివృద్ధి చెందలేదు. మరి మన ఊరేమోనదీ పరివాహ ప్రాంతలో ఉండి కాస్త పచ్చని పొలాలు, కాలువలు తో, కళకళ లాడుతున్న జనాలతో భలే ఉంటుంది గదా !! ఇవన్ని రమ కు చూపెట్టి రమ ఆశ్చర్య పోతుంటే చూడాలని శిల్ప గారి ముచ్చట. శ్రీరామ్ తన కూతురి పుట్టిన రోజు అనాధ పిల్లల మధ్య జరుపుకోవాలని, ఫంక్షన్ అదీ చేయకుండా, ఆ ఖర్చు అనాధ ఆశ్రమానికి విరాళం గానో, అనాధ పిల్లలకు పుస్తకాలు వస్తువులు ఇస్తున్నాడు. మంచిదే.!! సరే మరి ఈ కార్యక్రమానికి శిల్ప మరియు రమ నిన్న డెల్టా ఎక్ష్ప్రెస్స్ లో బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు శ్రీరామ్ ఫోన్ చేసి నన్ను, రితేష్ ను రమ్మని పిలిచాడు. వెళ్ళటం కుదరదు.

6, మే 2010, గురువారం

ఈ రోజు చేదు

మనుషులను నమ్మలేక పోతున్నాము . నిన్నటి దాక ఒంగి ఒంగి సలాములు చేసినవారే మనతో అవసరం తీరి పోయాక మన ముందే మనలని విమర్శి స్తున్నారు. చాలా జాగ్రత్త గా ఉండాలి ఈ నాయళ్ళతో. మన మధ్యలో వుండి మనకే గోతులు తవ్వుతారు. నవీన్ వ్యవహారం నాకు నచ్చ లేదు. ఏమైనా మన జాగ్రత్తలో మనం వుండాలి. (ఈ వ్యవహారం అంతా అయిపోయాక, నేను ఇంటికి వెళ్ళటానికి బండి స్టార్ట్ చేస్తుంటే అతనువచ్చి చేతులు పట్టుకుని సారిల మీద సారిలు చెప్పాడు) ఏది ఏమయినా అనవసరపు నిందలు వేయవద్దు అని చెప్పను.
ఇంకో సంఘటన ఏమిటంటే రితేష్ రొజూ రామ కృష్ణ మఠానికి (సమ్మర్ క్యాంప్) వెళుతున్నాడు కదా!! దాని కోసమై తీసుకెళ్ళి తీసుకుని రావటానికి ఆరు వందలకు ఒక ఆటో ని మాట్లాడాము. ఆ ఆటో వాడు మొదటి రోజే మొత్తం డబ్బులు కావాలని గోల పెట్టాడు. ఆ గోల పడలేక సగం అంటే మూడు వందలు ఇచ్చాము. ఒక వారం రోజులు బాగానే వచ్చాడు. ఆ తర్వాత అయిపు లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ఫ్ . పాపం కొంత మంది ఆరు వందలు ఇచ్చారంట. ఎవడిని నమ్మాలో అర్థం కావటల్లేదు.

5, మే 2010, బుధవారం

క్రికెట్ దెబ్బ

మొన్న మా రితేష్ వాళ్ళ అమ్మ తో బందువుల ఇంటికి వెళ్లి వాడి స్నేహితుడు ప్రణీత్, ఇంకో స్నేహితుడు తో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటే వీడి కి (రితేష్) కంటి కింద దెబ్బ తగిలింది. అదృష్టం కొద్ది కంటికి తగలలేదు. నేను ఇంతవరకు ఆ దెబ్బ బాల్ తో తగిలింది అనుకున్నాసాధారణంగా బాలే కదా తగిలేది. కాని బ్యాటు తో తగిలిందంట. ఆ దెబ్బకు ఎడమ కన్ను కింద నల్లగా కమిలింది. అందుకని వాడిని సరదాగా "కమిలిని రితేష్ " అని ఆట పట్టించాము.