15, అక్టోబర్ 2024, మంగళవారం


గాలివాన

నాకు బాగా గుర్తు. ఆ రోజు సాయంత్రం విపరీతమైన గాలి, వాన.  మేమున్న పూరిల్లు పడిపోతుoదేమోనన్న భయంతో మా అమ్మ , చెల్లి దగ్గర్లో ఉన్న మా డాబా తాత వాళ్ళింటికి వెళ్లారు.  నన్ను మా నాన్న గట్టిగా పట్టుకుని డాబా ఇంటికి  తీసుకెళుతున్నాడు. పట్టుకోకపోతే 9 ఏళ్ల పిలగాడు గాలికి దూదిపింజలా ఎగిరిపోయేవాడే! మొత్తానికి డాబాలో జేరాము. బయట ఉరుములు, మెరుపులు, డాబా కూడా పడిపోయిద్దేమో అన్నట్టు భయoకరమైన హోరు.  బిక్కు బిక్కుమంటూ అక్కడవున్న వడ్ల బస్తాలమీద పడి నిద్ర పోయా. 

తెల్లారికి అంతా నిశబ్దంగా ఉంది. బయటకొచ్చి చూస్తే చావిళ్ల మీద వున్న కప్పులు లేచిపోయి, బర్రెగొడ్లు కట్లు తెంచుకుని తిరుగుతున్నాయి. చెత్త వాములు సగమే ఉన్నాయి. చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడి ఉన్నాయి. జనాలు పడిపోయిన ఇళ్ళకాడ సామాన్లు సర్దుకుంటున్నారు. మా ఇల్లు పడిపోయింది. దూలం విరిగి నవ్వారుమంచం మీద పడి మంచం విరిగిపోయింది. గోడ కూడా పడిపోయింది. 

ఆ రోజో, తరవాతో హెలికాఫ్టర్లో  అప్పటి ప్రధాని ఇందిరమ్మ ఆ ప్రకృతి విలయాన్ని చుట్టానికి మనవూరి మీదుగా వెళ్ళింది. 

నష్టపోయిన చాలా మందికి బియ్యం, గోధుమలు, డబ్బులు 250 అనుకుంటా ఇచ్చారు. ఆ డబ్బుల పంపకాన్ని పిచ్చిమంత్రి అనే ఒకాయన (పేరు గుర్తులేదు) పర్యవేక్షించారు. ఆ డబ్బులు తీసుకుని మా ఇంటి పక్కనే ఉన్న గుడ్డెంకయ్య తాత సారా కొట్టుకాడినుంచి డబ్బులు అయిపోయేదాకా ఇంటికి రాలేదు. తాగి తాగి ఆ తర్వాత వారం రోజులకి పైకి పోయాడు.

17, సెప్టెంబర్ 2024, మంగళవారం

 మన వూరి సినిమా హాలు


నేను పుట్టక ముందో లేక నాకు ఊహ తెలిసేప్పటికే మనూళ్లో  సినిమా హాలు వుంది. దాని పేరు శ్రీ లక్ష్మి టూరింగ్ టాకీస్.  రెండు పక్కలా సినిమా పోస్టర్స్ అంటించిన ఒక గూడురిక్షా (సినిమా బండి)లో ఒకాయన రిక్షా తొక్కుతుంటే, ఇంకో ఆయన లోపల కూర్చుని రికార్డు ప్లేయర్లో సినిమా పాటలు ప్లే చేస్తూ వూరంతా తిరుగుతూ మధ్య మధ్యలో టాకీసులో ఆడుతున్న సినిమా గురించి ప్రచారం చేస్తుండేవారు. వీటికి తోడు పాంప్లెట్స్ కూడా పంచేవారు. వాటిని సినిమా కాయితాలు అనేవాళ్ళం. అవి రంగు రంగులుగా A4  సైజ్ పేపర్లో నాల్గవ వంతు వుండి ఆయా సినిమాల్లోని హీరో హీరోయిన్, కామెడీ నటుల నలుపు తెలుపు  ఫోటోలతో పాటు ఆ సినిమా గురించి కొద్దిగా కథ ప్రచురించి మరి సరోజ గోపిల ప్రేమ ఫలించిందా? రాజనాల ఆట కట్టించారా?? తెలుసుకోవాలంటే ఈ రోజే వెండి తెరపై చూడండి అని వుండేది. ఆ పేపర్లను రిక్షాలోంచి విసురుతుంటే పిల్లలందరం ఆ రిక్షా వెనకే పరిగెత్తుతూ వాళ్ళు విసిరే పేపర్లని చేజిక్కించకోవడానికి పోటీ పడేవాళ్ళం.  ఇక ఆయన మైకులో ఇలా చెప్పేవాడు. "నేడే చూడండి, మీ అభిమాన సినిమా థియేటర్ శ్రీ లక్ష్మి టూరింగ్ టాకీస్ లో నటశేఖర కృష్ణ, అందాల తార జయప్రద నటించిన వూరికి మొనగాడు సినిమా" అంటూ ఇంకా చాలా చెప్పేవాడు. ఆ సినిమాలో పాటలు మోగించేవాడు. 


ఈ టాకీస్ పెద్దకాలువ ఒడ్డున వుండేది (ఇప్పటి వంతెన పక్కన, అప్పటికి వంతెన లేదు. బల్లకట్టుపై కాలువ దాటే వాళ్ళు).  రోజుకు ఒక ఆట మాత్రమే. ఎప్పుడైనా రెండు ఆటలు ఆడించే వాళ్ళు. ముఖ్యంగా రాత్రుళ్ళు మాత్రమే సినిమాలు ఆడేవి. నాకు తెలిసినప్పుడు అంటే 78-80ల్లో టిక్కెట్ రేటు నేల 45 పైసలు, బెంచి 60 పైసలు, కుర్చీ రూపాయి వుండేది. సినిమా తొమ్మిది కి మొదలైతే ఎనిమిది నుంచి పాటలు పెట్టే వాళ్ళు. మొదట సీతారాముల కళ్యాణం చూతము రారండి తో మొదలై ఆ తర్వాత వరసగా మరోచరిత్ర సినిమాలోని ఏ తీగపువ్వునో, భలే భలే మగాడివోయ్, పదహారేళ్లకూ   నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకి కోటి దండాలు మొదలైన పాటలతో మోత మోగించేవాళ్ళు.

ఇక చివరి పాట అంటే ఆఖరి రికార్డు హే కృష్ణా ముకుందా మురారీ పాట వదిలేవాళ్ళు. ఇక చూడు జనాలు యహే ఆకర్రికార్డు కూడా ఏసారు పదండి పదండి అని తొందర పెట్టేవాళ్ళు.  ప్రొజెక్టర్ రూం కన్నం లోంచి హాలు నిండిందా లేదా చూసి జనాలు మరీ పలచగా వుంటే ఆఖరి రికార్డు మళ్లీ తగిలించేవాడు.


వేటగాడు సినిమా చాలా బాగుందిరా నిన్న చూసా అంటూ బళ్ళోకొచ్చిన దగ్గర నుండీ ఆ సినిమా డైలాగ్ టూ డైలాగులతో వూదరగొడుతున్న శీనుగాడి దెబ్బకి మనకి సినిమా చూడాలన్న తెగులు పుట్టింది. అంతే బడి అవగానే ఇంటికొచ్చి యుద్ధం మొదలెట్టాను. చాలా సేపు సాగిన ఆ సంగ్రామంలో విజయమూ దాంతో పాటు అర్ధ రూపాయి సాధించి, అప్పటిదాకా అలిగి తినకుండా పళ్ళెంలోనే ఉన్న అన్నాన్ని రెండు నిమిషాల్లో తినేసి, సినిమా హాలు మైకులో నుండి వినబడుతున్న భలే భలే మగాడివోయ్ పాటని హమ్ చేసుకుంటూ వేగంగా హలు వైపుకి పరుగు తీసాను.


కాలవ వొడ్డున ఉన్న సినిమా హాలు లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సినిమా పోస్టర్స్ లో వున్న నటీనటులు మా ఇంటికి రా అని ఆహ్వానం పలుకుతున్నట్టుగా వున్నారు. గబుక్కున జేబులోంచి అర్ధ రూపాయి బిళ్ళ తీసి కౌంటర్ లో ఇచ్చి టికెట్టు మిగిలిన ఐదు పైసల చిల్లర జాగ్రత్తగా జేబులో పెట్టుకొని, మళ్లీ ఒకసారి పోస్టర్స్ తనివితీరా చూసుకుని కాలువ వొడ్డుకొచ్చి నిలబడ్డాను. సెలవు రోజుల్లో కాల్వ రేవులో గేదెల తోకలు పట్టుకుని నేర్చుకున్న ఈత నుండి బల్లకట్టెక్కి కాలువ మధ్యలోకి దూకే వరకూ ఈత వచ్చిన నాకు ఈ వెన్నెల రాత్రి ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలువ ఏమిరా ఇప్పుడొచ్చావు? సినిమాకొచ్చావాని పలకరించినట్టనిపించింది. పగలంతా  అలుపు సొలుపు లేకుండా వూరి జనాలని ఆ దరికి ఈ దరికి చేర్చిన బల్లకట్టు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుంది. 


సినిమా హాలు గేటులో టికెట్టు ఇచ్చి లోపలకి వచ్చి నేల మీద (ఇసుకలో) చతికిలబడి ఒకసారి చుట్టూ చూసాను. సినిమా వచ్చి వారమైనా జనాలు గొలగోలగా బానే వచ్చారు. సినిమా మొదలవ్వుతుందన్నట్టుగా వీనుల విందుగా గణగణమని బెల్లు మోగింది. తెల్లటి తెరమీద నిశ్శబ్దం అని ఒక బుడ్డోడు నోటిమీద వేలేసుకున్న ఒక స్లైడు పడింది. ఆ తర్వాత ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు అనే స్లైడ్. NFDC వాళ్ల ఐదు నిమిషాల డాక్యుమెంటరీ (ట్రైల్ పార్టీ అనేవాళ్లం) తర్వాత అసలు సినిమా మొదలైంది. 


 చిన్నప్పుడు నాకు సినిమాల్లో పాటలంటే చిరాకు. ఫైట్లు, కామెడీ సీనులంటే ఇష్టం. తెరమీద బల్లులు కూడా నటులతో పోటీ పడేవి. తెరమీద బొమ్మ ఆగిపోయి ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. విశ్రాంతి (ఇంటర్వల్) అనుకునేరు, కాదు మన టాకీసులో ఒకే ప్రొజెక్టర్ వుంది. సో.. రీలు మార్చి మళ్లీ మొదలు పెట్టాలి. మొత్తం నాలుగు పార్టులుగా సినిమా చూడాలి. మధ్యలో కరెంటు పోతే పార్టులు ఇంకా ఎక్కువవుతాయి. కాసేపటికి విశ్రాంతి.

 లైట్లు గుప్పుమని వెలిగాయి. ఆ.. సోడా సోడాయే అనుకుంటా షోడా కేసు పట్టుకుని నేల, బెంచి, కుర్చీల సెక్షన్లకి అమ్మేవాళ్లు తిరుగుతున్నారు. పది పైసలు తీసుకుని షోడా సీసా మీద tube ముక్క పెట్టీ ఓపెనర్ తో నొక్కి కిచుక్కుమనే అదో సౌండు తో ఓపెన్ చేసి ఇచ్చేవాడు. మనకి షోడా తాగే సీన్ లేదు. జేబులో ఉన్న ఐదు పైసలుతో బయటకి వెళ్ళి జీడీనో, పప్పుండో కొనుక్కుని బుగ్గనేసుకుని వచ్చేవాడిని.  విశ్రాంతి తర్వాత సినిమా మొదలయ్యే ముందు రాబోవు చిత్రాలు అని కొన్ని సినిమాల స్లైడ్స్ వేసేవారు. నేల ముందే తెర ఉండటం వల్ల మెడ నొప్పి పుట్టేది. మెల్లగా అటూ ఇటూ చూసి గేటుకాడ ఎవరూ లేకుండా చూసి నేలకి బెంచికి మధ్యనున్న కర్రలతో కట్టిన బ్యారికెడ్ దూకి బెంచిలో సెటిల్ అయ్యేవాళ్లం. 

 

సినిమా అయిపోయాక అరే అప్పుడే అయిపోయిందా అనుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి ఒకే టికెట్టు మీద రెండు ఆటలు వేసేవాళ్లు. రెండు సినిమాలు అయిపోయేవరకు తెల్లారి 3 గంటలయ్యేది.

ఈ హాల్లో చివరి సినిమా కొండవీటి సింహం. రేపే ఆఖరాట అని ప్రతీ రోజూ చెప్పి నెల పైగా ఆడించారు.

30, నవంబర్ 2014, ఆదివారం

రితేష్ అరుణాచల ప్రదేశ్ NCC ట్రిప్ :

NCC లో   భాగంగా  రితేష్ అరుణాచల ప్రదేశ్ ట్రెక్కింగ్ క్యాంపు కి ఈ రోజు 30-11-2014 న గువహతి ఎక్ష్ప్రెస్స్ లో ఏడు గంటల ముఫై నిముషాలకి పవన్ సింగ్ తో బయలుదేరాడు. ఇది మొత్తం సుమారు 15 రోజుల క్యాంపు. 
ప్రయాణ సంసిద్దత 

క్యాంపు కి వెళ్ళే ముందు 1 ఆంధ్రా bettallion కి వెళ్లి ప్రయాణానికి కావలసిన అన్నింటి గురించి తెలుసుకుని, ప్రయాణ తేదిని, ఎన్ని రోజుల ప్రయాణం, ఏ రైలు కి వెళ్ళవలసింది అన్ని తెలుసుకుని వచ్చాడు. 

30వ తేది నవంబరు 2014 న ఉదయం 7:30 కి సికందరాబాద్  నుండి గువహతి ఎక్ష్ప్రెస్స్ లో ప్రయాణం. ఇక్కడ బయలు దేరితే  రైలు గువహతి  [Secunderabad to Guwahai train journy details] 2వ తేది డిసెంబర్ 2 ఉదయం 5.50కి చేరుకుంటారు. 

ఈ ప్రయాణం కోసం NCC  వాళ్ళు ముందే  రాను పోను రైలు టికెట్లు బుక్ చేసారు. వీరి కోసం ప్రతి ఒక్కరికి దోమ తెర , ఒక పెద్ద బ్యాగు (గొనె సంచి లాంటిది ), ఒక డ్రెస్సు, టోపీ ఇచ్చారు. వీడు ఇక్కడ నుండి ఒక ట్రెక్కింగ్ బాగు, వాళ్ళిచ్చిన   పెద్ద బ్యాగు లో అన్ని సర్దుకుని (bisucuits, odomus, బాడీ స్ప్రే , అబ్బో ఇంకా చాలా పెద్ద ఎత్తునే, ట్రాక్ సూట్, స్వెట్టర్, శిల్ప చేసిన చక్రాలు, కేకు, వాటర్ బాటిల్స్ ఇంకా చాల )

ఆ రోజు పొద్దునే 2 గంటల నుండి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టారు. మొత్తం 4 సంచులు. పవన్ సింగ్ , రితేష్, 5 గంటల mmtc  ఎక్కి  సికందరాబాద్ వెళ్ళారు. నేను శిల్ప తరువాత బండి లో రెండు బ్యాగులతో స్టేషన్ చెరుకున్నాము. 

9, నవంబర్ 2014, ఆదివారం

మొట్టమొదటి విమాన ప్రయాణం - బెంగళూరు ట్రిప్ 

ఒక్క సారన్నా విమనమెక్కుదామని రితేష్, శిల్ప, నేను అనుకున్నాము. దసరా సెలవులలో బెంగళూరు విమానంలో వెళదామని నిర్ణయించుకున్నాం. అప్పుడే పేపర్లో చవక ధరలకు విమాన ప్రయాణం అనిచూసి స్పైస్ జెట్ విమానయాన సంస్థ వారి వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్స్ బుక్ చేసాను. కాని పేమెంట్ టైములో నెట్ ప్రాబ్లం తో అది సక్సెస్ కాలేదు. మరుసటి రోజు ఇండిగో  విమానయాన సంస్థ వారి వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్స్ బుక్ చేసాను. మొత్తం ముగ్గురికి 6000 రూపాయలు అయ్యింది. 

28 సెప్టెంబర్ 2014 న మా ప్రయాణం ఖరారు అయ్యింది. ముందు రోజు కాబ్ బుక్ చేసి 8 గంటలకు కారులో ఇంటినుండి బయలుదెరాము. 40 నిముషాల్లో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. కాబ్ 500 రూపాయలు అయ్యింది. ఫ్లైట్ టైం 11.30

కాసేపు   ఎయిర్ పోర్ట్  బయటే కాలక్షేపం చేసి, మొబైల్ తో  కొన్ని ఫోటోలు తీసుకుని,
  
లోపలి వెళ్లి లగ్గేజి ట్యాగ్ వేయించుకుని, సెక్యూరిటీ చెక్ అయిపొయ్యాక లోపలకి వెళ్లి విండో షాపింగ్ చెస్తూ ఇంకొన్ని ఫోటోలు తీసుకున్నాము  కాసేపు వచ్చే పోయే విమానాలను చూసుకుంటూ టైం పాస్ చేసాము
 



మొట్టమొదటి సారిగా ముగ్గురం విమానంలో కాలు పెట్టాం. లోపల ఎయిర్హోస్టెస్ వాళ్ళు ఏదో సెక్యూరిటీ డిమోన్ స్ట్రేషన్ ఇచ్చారు. ఆ తరువాత విమానం టేక్ ఆఫ్ అయ్యింది. గాల్లో ప్రయాణం. మాకు కిటికీ పక్క సీట్లు రాలేదు. బయట మేఘాలు తప్ప ఏమీ  కనపడటం లేదు. వింత అనుభవమే. శిల్ప ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంది. నేను కుడా  రితేష్ మాత్రం  ఇదంతా నాకలవాటే అన్నట్టు కాజువల్ గా వున్నట్టు నటిస్తున్నాడునిన్నుఫోటో తీస్తారా"అన్నా మా వంక చూడకుండా ఎటో చూస్తున్నాడు. శిల్ప ను మాత్రం ఒక ఫోటో తీశాను.
గంట లోపే విమానం బెంగళూరు లో ల్యాండ్ అయ్యింది. విమానం ముందుకే ఎయిర్ కండిషన్ బస్సులు వచ్చాయి. ప్రయాణీకులంతా ఆ బస్సుల్లో ఎక్కి రన్వే నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం. వెళ్ళిన కాసేపటికి కన్వేయర్ బెల్ట్ మీద మా luggage వచ్చింది. అవి తీసుకుని బయటకు వచ్చాము. అక్కడ నుండి క్యాబ్ లో శ్రీదేవి వాళ్ళ ఇల్లు చేసుకున్నాము. 

లక్ష్మీ పురం లో రెండు రోజులు (చాల రోజుల తరువాత )

ఓకే ! మేము లక్ష్మీ పురం లో ఉంటున్నప్పుడు మా పక్కింట్లో పెద్దబ్బాయి వాళ్ళు ఉండే వారు. of course!! మనం మున్నంగి షిఫ్ట్ అయ్యా మానుకో ! పెద్దబ్బాయి వాళ్ళు మాత్రం అక్కడే ఇంట్లోనే ఉంటున్నారు. పెద్దబ్బాయి అసలు పేరు పెద్ద వెంకట రెడ్డి. ఈయనకి ఒక తమ్ముడు చిన్నబ్బాయి. ఆయన పేరు చిన్న వెంకట రెడ్డి . పెద్దబ్బాయి కి ఇద్దరు పిల్లలు మొన్నీ మద్య పెళ్ళిలో పెద్దబ్బాయి కనపడి మా వాడికి మంచి పిల్ల ను చూడండ్రా . పెళ్లి చేద్దాము అన్నాడు.

మొత్తానికి కొడుక్కి పెళ్లి కుదిర్చి హైదరాబాద్ వచ్చి నన్ను, వెంకట రెడ్డి ని, శేషి రెడ్డి ని పెళ్ళికి తప్పక రావాలని శుభ లేఖలిచ్చి వెళ్ళాడు.


వెంకట రెడ్డి ఆఖరి ఘట్టం 

అక్టోబర్ 31, 2014 మద్యాహ్నం కాలేజీ కి వెళ్దామని లంచ్ చేస్తున్నాను . ఫోన్ వచ్చింది శ్రీను గుంటూరు నుండి.
సర్లే ! తరువాత మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. కాసేపటికే మరో ఫోన్ అంజి రెడ్డి నుండి. ఏమై  వుంటుందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశా ! " వేణు! హాస్పిటల్ కు వెళ్ళావా ! " అని ఇంకా చెప్పబోతుంటే మనసు కీడు శంకించింది. వెంకట రెడ్డి కి ఏమైంది ? అన్నా వణుకుతున్న గొంతుతో.
"నీకు తెలియదా ? సుబ్బారెడ్డి లక్ష్మి పురం తీసుకు వద్దామనుకున్తున్నాడు. అక్కడ వాళ్ళేమనుకున్తున్నారో " అన్నాడు
నాకు పూర్తిగా అర్థం అయ్యింది. వెంకట రెడ్డి ఇక లేడని. భోజనం చెయ్య బుద్ది కాలేదు. శిల్ప తో విషయం చెప్పను. అయ్యో ! అంది.
శ్రీనుకు ఫోన్ చేసాను. "రాజేంద్ర ఫోన్ చేసి చెప్పాడు . అది చెబుదామనే నీకు ఫోన్ చేసాను" అన్నాడు
ఏదో తిన్నాననిపించి వెంటనే నిమ్స్ హాస్పిటల్ కు బయలు దేరాను.

ప్రవీణ్ కు ఫోన్ చేసి ఏ వార్డో  కనుక్కుని అక్కడకు చేరుకున్నాను. అక్కడ విష్ణు, శోభన్, ప్రవీణ్, వెంకట రెడ్డి భార్య బయట కుర్చుని వున్నారు. ప్రవీణ్, విష్ణు తో లోపలకి వెళ్ళాను.

హాస్పిటల్ బెడ్ మీద ప్రాణం లేని వెంకట రెడ్డి పడి వున్నాడు. ఆక్సిజెన్ ట్యూబ్ నోట్లేనే వుంది. శ్వాస ఆడుతున్నట్టు పొట్ట పైకి కిందికి కదులుతుంది - బ్రతికే వున్నాడా అన్నట్టు. వెంకట రెడ్డి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను, చల్లగా వుంది. ముఖం నిర్మలం గా కొంచెం ఉబ్బి  వుంది. తలకు రంగు వేసాడనుకుంటా ! గడ్డం నున్నగా షేవ్ చేసి వున్నాడు.
కాసేపటి తరువాత బయటకి వచ్చాం. కృష్ణ (వెంకటరెడ్డి భార్య) 2014 మొత్తం హాస్పిటల్ లోనే సరిపోయింది. కొత్త ఇల్లు కొన్నా, ఇంట్లో వుంది చాల తక్కువ అని బాధ పడింది. పాపం ఆ మాట నిజమే ! వెంకటరెడ్డి కూడా తన బాధల నుండి విముక్తి చెందాడు. కిడ్నీలు రెండూ  ఫెయిల్ అయ్యి నరక యాతన అనుభవించాడు. మరీ ఈ సంవత్సరమే !

ఇంతలో శేషి రెడ్డి వచ్చాడు. మరల ఇద్దరం వెళ్లి వెంకట రెడ్డి ని చూసి వచ్చాం. లోపల ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇంతలో నవీన్ (వెంకట రెడ్డి చిన్న కొడుకు ) కెనడా నుండి ఫోన్ చేసాడు. తను వచ్చే వరకు సోమవారం అవుతుంది అన్నాడు. తరువాత రాలేనన్నాడు.

అంబులన్స్ మాట్లాడి బాడీని లక్ష్మీ పురం పంపించాము. ఆ తెల్లారి శనివారం (4. 30) నేను, శేషి రెడ్డి, విష్ణు, నవీన్ (శేషిరెడ్డి కొడుకు) నలుగురం విష్ణు కారులో బయలు దేరి లక్ష్మీ పురం 8 గంటలకల్లా చేరాము.

వెంకట రెడ్డి బాడీ ని స్నానం చేయించి  పాడే మీదకెక్కించారు. దండలు, పూలు వేసారు.  గుంటూరు నుండి శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో వచ్చారు. మోహన్ ముందు రోజే వచ్చాడు. కొబ్బరి కాయలు కొట్టారు. నేను కుడా పూలు వేసి కొబ్బరి కాయ కొట్టాను. శేషి రెడ్డి, నవీను, సాంబి రెడ్డి ఇంకా అవుతు వాళ్ళు పాడే నెత్తుకున్నారు.
ఊరికి ఉత్తరాన కాలువ వడ్డున దహన సంస్కారాలు జరిపించారు.

ఇక పెద్ద కర్మ నెక్స్ట్ డే ఆదివారమే చేద్దామనుకున్నారు. తరువాత కెనడా నుండి నవీన్ వస్తాడని చెప్పారు, అందుకని 11 వ రోజు పెద్ద కర్మ జరుపుదామనుకున్నారు. అంటే 10 వ తారీఖు.

నేను  శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కి వచ్చి జన్మభూమి ఎక్ష్ప్రెస్స్ లో హైదరాబాద్ వచ్చాను. ఇంటికి వచ్చే వరకు దగ్గర దగ్గర 10 గంటలయింది.




16, జులై 2010, శుక్రవారం

నా ముచ్చట్లు

బహుశాఅప్పుడు నాకు మూడేళ్ళు ఉంటాయేమో!! సరిగా గుర్తు లేదు। కాని ఒక సంఘటన కొంచెం జ్ఞాపకం ఉంది. నేను అందరితో " నేను మా అమ్మ నాన్న ల పెళ్లి చూసాను " అని చెప్తున్నాను. అందరు ఒకటే నవ్వుతున్నారు. వాళ్ళు నామాటలు మా నాయనమ్మకు చెబితే ఆవిడా నవ్వింది. మా అమ్మ కు ఎవరో ఈ విషయం చెబితే అమ్మ కూడా నవ్వింది. అత్తలు కూడా పెద్దగా నవ్వారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో మన చిట్టి బుర్ర కు అర్థం కాలే. అసలు విషయం మనకు పదేళ్ళు వచ్చినప్పుడు గాని అవగతం కాలేదు. నాకు బాగా ఉహ తెలిసిన తరవాత ఈ విషయాన్ని మాటల సందర్భం లో మా అమ్మ ఎవరితోనో చెబుతూ "మా వాడు మా పెళ్లి చూశానని చేప్పేవాడు. మా మరిది పెళ్ళప్పుడు సత్యనారాయణ వ్రతం నోచుకునేటప్పుడు మమ్ముల్ని కూడా పీటల మీద చూసి మేము కూడా పెళ్లి చేసుకుంటున్నామనుకుని మా వాడు అలా అందరికి చెప్పేవాడు." అంది. అలాగే నేను చిన్నప్పుడు మా అమ్మను తినటానికి ఏదైనా పెట్టు అని తెగ విసిగించే వాడిని. ఓ రోజు ఇలాగే విసిగిస్తుంటే మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు.